దశరథుడు శ్రీరాముని అరణ్యానికి వెళ్ళమంటే సీత కూడా వెంట వెళ్ళినది కదా! లక్ష్మణుని వెంట ఊర్మిళ ఎందుకు వెళ్ళలేదు?
వెళ్ళవలసినవాడు శ్రీరాముడు.సేవార్ధమై వెళ్ళినవాడు లక్ష్మణుడు. సీతకు రాముని అనుజ్ఞ చాలుకాని లక్ష్మణునికి అరణ్యానికి వెళ్ళడానికి ఆజ్ఞయే కష్టమైనది. కాక సేవించడానికి వెళ్ళే లక్ష్మణుని వెంట ఊర్మిళ వెళ్ళడం అప్రస్తుతం.

భారతంలో శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలు అపహరించాడు. దుశ్శాసనుడు భారతంలొ వస్త్రాపహరణం చేశాడు. శ్రీకృష్ణుడు భగవంతుడెలా అయ్యాడు? దుశ్శాసనుడు దుర్మార్గుడెలా అయ్యాడు?
ఈ రెండింటికి సంబంధం లేదు. తనను కోరి సంకీర్తించి, తపించు గోపకన్యల దేహాభిమానం తొలగించి, అహంకారాన్ని తీసివేసి అనుగ్రహించటం శ్రీకృష్ణుడు చేసి వస్త్రాపహరణం. వారే నిత్యానందాన్ని పొంది పరమేశ్వరుని సేవించారు. దుష్ట, చతుష్టయ క్రౌర్యంతో ప్రణాళికాపూర్వకంగా ఒక కులస్త్రీని, అన్న భార్యను,, ఏకవస్త్రను సభారంగంలో పరాభవించడం దుర్మార్గం కదా!

శ్రీరాముని వంటివారు భార్యను అనుమానిస్తే అది చదివిన సామాన్యుని స్థితి ఏమిటి?
శ్రీరాముడు భార్యను అనుమానించాడని, నమ్మకం లేనివాడని తెలుసుకుంటూ రామయణం చదువుతుంటే అది ఏమీ ఫలమివ్వదు. కాన అర్ధగ్రంథాలు సందేహాలు పోయేటట్లు చదివి, లేదా తెలుసుకోవాలి. శ్రీరామునికి భార్యయందు సంశయం లేదు. రాజధర్మము యొక్క కాఠిన్యం చూపించాడు. కాబట్టే అశ్వమేధంలొ సీత ప్రతిమనే పెట్టుకొన్నాడు.

శివుని లింగ రూపంలో ఎందుకు పూజిస్తున్నారు? ఆకారంలో పూజింపకూడదా?
శివునికి రెండు రూపాలు చెప్పింది శివ పురాణం. నిర్గుణం, సగుణం... నిర్గుణ రూపమే లింగం. సగుణరూపం పంచముఖం, అభిషేకం శివునికి ప్రశస్తం గాన నిర్గుణమైన లింగాన్ని పూజించుటయే శ్రేష్టం. సగుణమైన సాకారం ధ్యానించుటలో ముఖ్యం.

కామదాహం అధికంగా గల ఇంద్రుడు సజ్జనులైన దేవతలకు ప్రభువెలా అయ్యాడు? ఇంద్రుడు పదవి పేరా? వ్యక్తి పేరా?
ఇంద్ర పదవి కొంత పుణ్యంతో సంపాదించే మహోన్నత స్థానం. అది ఒక పదవి పేరు. అంత పరమస్థానం పొందినా తప్పులు చేయటం ఉపాధి లక్ష్మణం అని, ఎంతవారు చేసినా తప్పునకు శిక్ష తప్పదనీ ఆ కథలు చెప్తున్నాయి.

మల్లాది చంద్రశేఖరశాస్త్రి