జ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు, మనకంటే పెద్ద వారి పాదాలకు చేసే నమస్కారమే "పాదాభివందనం".

అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః!
చత్వారితస్యవర్ధంతే ఆయుర్విధ్యా యశోబలం!!


అంటే వయసువల్ల కాని , విద్యవల్ల కాని అధికులైనవారికి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తే , మనకి ఆయువు, విద్య, కీర్తి, బలం, ఐశ్వార్యాభివృద్ధి లభిస్తాయని మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పిన మాట ఇది.


'నమస్కారం' మన సంస్కారానికి చక్కని పురస్కారం. ఇక యోగభ్యాసంలో మొదటి భంగిమ "నమస్తే." వినయానికి ప్రతీక నమస్తే. రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడం మంచిది. 'నమస్తే ' బార్య భర్తల ఆదర్శ దాంపత్యానికి కూడా పతాకగా నిలిచే విధంగా "పాణిగ్రహణం " చేయిస్తున్నాము. దీనినే "కరచాలనం" అని కొందరంటారు."కరచాలనం" ఒక విధమైన నమస్కార పద్ధతి. కరచాలనం భారతీయ సంస్కృతికి సంభంధించినది కాకపోయినా, అతి సులువుగా, సౌకర్యాంతంగా చేసే నమస్కారంగా, మన జీవితంలో భాగమయిపోయింది. అయితే, పెద్దలకు, గురువులకు "ఏకహస్తాభివందనం" చెయ్యకూడదని హితవచనం. ఇటువంటి వారికి కరచాలనం చేసే సంధర్భం వచ్చినపుడు, వారి చేతులను , మన రెండు చేతులలోకి తీసుకొని, నమస్కరించడం ఉత్తమం. అయితే, అసలు శరీరంలో ఏ ఇతర అవయవాలకీ కాకుండా కేవలం పాదాలకు మాత్రమే ఎందుకు నమస్కరించాలి? అన్న విషయానికి వస్తే, యోగులలోను, మహాత్ములలోను, మన మంచిని కోరే పెద్దలలోను అభివృద్ధిని కోరే సద్గుణం ఉంటుంది. అటువంటి సాత్వికాభివృద్ధి యొక్క భావనాశక్తి, వారి శరీరంలో ప్రవహించి, వారి అరచేతులలోనూ, పాదాలలోను నిలిచి ఉంటుంది. అందుకే వారి పాదాలకు నమస్కరిస్తే, తమ అరచేయిని మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తే , వారి సాత్విక శక్తి మనలో ప్రవేశించి, మనకు ప్రతిస్పందన కలుగుతుంది. ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది. అందుకే మనపెద్దలకు, గురువులకు పాదాభివందనం చేసేప్పుడు, వారి కుడి పాదాన్ని మన కుడి చేతిలోను, వారి ఎడమ పాదాన్ని మన ఎడమ చేతితోను తాకుతూ వందనం చేయాలని మను ధర్మశాస్త్రంలో పేర్కొన్నాడు. అంటే మనం నమస్కారం చేస్తున్నప్పుడు , మన చేతులను ఒక దానిపై మరొకటి " X " క్రాస్ గా పెట్టి నమస్కరించాలి. ఈ ప్రక్రియలో ఎడమ చేయి క్రింద, కుడి చేయి పైన ఉండేట్లు చూసుకోవాలి. మనకంటే చిన్నవారికి నమస్కారం చెయ్యకూడదు. మనకంటే పెద్దవారికి, వారి బార్యలకు నమస్కారం చెయ్యాలి. గురుపత్ని మనకంటే వయస్సులో చిన్నవారైనా, వారి వయస్సు లెక్కలోకి రాదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినదేమింటంటే యువతులకు నమస్కరించేప్పుడు, వారి పాదాలను తాకకుండా నమస్కరించాలి. ఇంక ఈ నమస్కార ప్రక్రియలో "సాష్టాంగ నమస్కారం" కూడా ఉంది. ఇందులో 3 యోగాసనాలు కూడా ఇమిడి ఉన్నాయి.

నైమిశారణ్యం లో నా మొదటి టపా ఇలా పాదాభివందనం విషయంతో, వినమ్రంగా మీ ముందుకు వస్తున్నాను.

రమణి.