కృత్తిక : 2,3,4 పాదములు , రోహిణి: 1,2,3,4 పాదములు , మృగశిర 1,2 పాదములు

ఆదాయం 8 , రాజపూజ్యం 7 , వ్యయం 11 , అవమానం 5

ఈ రాశి వారికి గురుడు 9-12-08 వరకు అష్టమ స్థానమగు (8) ధనురాశి యందు అనంతరం (9వ స్థానములో) మకర రాశి యందు, శని ఈ సంవత్సరమంతయు (4) అర్ధాష్టమ స్థానములో సింహరాశియందు, రాహువు 30-4-౦౮వరకు
(10) పదవ స్థానమగు కుంభరాశి యందు, అనంతరము (9) నవమ స్థానములో మకర రాశియందు, కేతువు 30-4-08 వరకు (4) చతుర్ధ స్థానములో సింహరాశి యందు, అనంతరము (3) తృతీయ స్థానమైన కర్కాటక రాశియందు సంచరించెదురు. ఈ రాశి వరికి ప్రారంభము లగాయతు సామాన్యముగా ఉండును. మనస్సుకు స్థిమితము లేకపోవుట, ఆదాయమునకు మించిన అనవసర ఖర్చులు, చేయు కృషి యందు అభివృద్ధి లేకపోవటం, శత్రువులవలన బాధలు, ఊహించని చికాకులు, వాహన ప్రమాదములు, ఏ పనిచేయుటకు ఉత్సాహము లేకపోవుట, స్థల మార్పులు, ఉద్యోగరీత్యా అధికారులచే మాటలు పడుట, సస్పెన్షన్లు, ఆరోగ్యరీత్యా నరముల నిస్త్రాణ, కీళ్ళ నొప్పులు, ఉదర సంబంధమైన బాధలు, వైద్యరీత్యా ధనవ్యయమగుచుండుట, భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవుట, ప్రతి చిన్నవిషయమునకు గొడవలు పడుచుండుట మొదలగు ఫలములుగా ఉండును
డిశంబరు నుండి పరిస్థితులలో క్రమేణా మార్పులు కనిపించును. పుణ్యక్షేత్ర సందర్శనం, దైవాంశసంభూతులైన వ్యక్తులను కలియుటవలన మన:శాంతి కలుగును.ఉద్యోగస్తులకు ఇష్టములేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరిగి, బాధ్యతలు ఎక్కువై పని ఒత్తిడి పెరుగును. పైఅధికారులతో విరోధము, సస్పెన్షన్లు, గుప్తధనము వెల్లడవుట జరుగును. ప్రవేటు సంస్థలలో పని చేయువారికి అభివృద్ధి ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశములు తక్కువ. విద్యార్ధులు శ్రద్ధగా చదివినగాని ప్యాసగుట, ర్యాంకులు వచ్చుట కష్టము. మొదటి చాన్సు కన్నా, రెండవ చాన్స్ లో మంచి మార్కులు వచ్చును. కుటుంబ పరిస్థితుల వలన విద్యకు ఆటంకములు కలుగుచుండును. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఇష్టములేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును.వ్యవసాయదార్లకు మొదటి పంటకన్నా రెండవ పంట ఆదాయము బాగుండును. వ్యయప్రయాసలు ఎక్కువగును. పండ్లతోటల వారికి మధ్యమ లాభము కలుగును.వ్యాపారస్థులకు డిశంబరు వరకు సామాన్యముగా ఉండును. నూతన ఏజన్సీలు కలసిరావు. సరుకులు నిలువచేయువారికి అధికారుల వలన ఆకస్మిక దాడులు జరుగుచుండును. ఇతరులకు హామీలు ఉండుటవలన చిక్కులలో పడుదురు.క్రీడాకారులు, కళాకారులు, టి.వి, సినీ, నటీనటవర్గము వారికి ప్రతిభకు తగిన గుర్తింపు ఉండదు. అవకాశములు వచ్చినట్లు కనిపించి నిరాశ కలిగించును. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగును. సినీ నిర్మాతలకు వ్యయప్రయాసలు ఎక్కువగును. రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఏర్పడుచుండును. ప్రజాదరణ తగ్గును. పదవులలో మార్పులు వచ్చును. జనవరి లగాయతు పరిస్థితులలో మార్పు కనిపించును. కాంట్రాక్టరులకు లేబర్ సమస్యల వల్ల, సరుకుల ధరలు పెరుగుట వలన చేయు పనులకు కొంతకాలము ఆటంకములు ఏర్పడును. జనవరి లగాయతు పరిస్థితులు అనుకూలించి బిల్లు సకాలములో వసూలగును.

ఈ రాశి స్త్రీలకు ధన గౌరవాదులకు లోటు ఉండదు.కుటుంబ సమస్యల వలన మన:శాంతి తక్కువగా ఉండును. ఉద్యోగములో ఉన్నవారికి ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ ఫర్ జరుగును. భార్యాభర్తల మధ్య అవగాహన లోపించును. ఆరోగ్య విషయములో జాగ్రత్తగా ఉండవలెను. నరముల నిస్త్రాణ, వాత సంబంధమైన నొప్పుల వలన బాధలు, అనవసర ప్రయాణముల వలన ధన వ్యయమగుచుండును. వివాహం జరగవలసినవారికి డిశంబరు లగాయతు అనుకూల పరిస్థితులు ఏర్పడును. ప్రేమ వ్యహారములు అనుకూలించవు.

కృత్తిక 2,3,4 పాదముల వారికి ఏప్రియల్, ఆగష్టు, సెప్టెంబరు, డిశంబరు, 2009 జనవరి నెలలు అన్ని విధములా
బాగుండును. ఈ నెలలలో నూతన వ్యక్తులతో స్నేహలాభములు, పాత బాకీలు వసూలగుట, విలువైన వస్తువులు కొనుట జరుగును. వీరు జాతికెంపు ఉంగరములో ధరించవలెను. ఆదివారము గోధుమలు దానము ఇవ్వవలెను. 3,4,5,9 అదృష్ట సంఖ్యలు, బుధ, శుక్ర, శనివారములు అదృష్టవారములు.

రోహిణి వారికి ఏప్రియల్, మే, ఆగష్టు, సెప్టెంబరు, డిశంబరు, 2009 జనవరి నెలలు అన్ని విధములా బాగుండును.
ఈ నెలలలో ధనాదాయము బాగుండును. వివాహాది శుభకార్యములు కలసి వచ్చును. హోదాగల వ్యక్తులతో స్నేహలాభములు కలుగును. వీరు జాతిముత్యమును ఉంగరములో ధరించవలెను. సోమవారం బియ్యం దానం ఇవ్వవలెను. 1,2,3,4 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారములు అదృష్టవారములు.

మృగశిర 1,2 పాదములవారికి ఏప్రియల్, మే, సెప్టెంబరు, 2009 జనవరి నెలలు అన్ని విధములా బాగుండును.
నెలలలో పుణ్యక్షేత్ర సందర్శనం, స్త్రీ మూలక సహాయము వలన పనులు నెరవేరుచుండును. వీరు జాతిపగడము ఉంగరములో ధరించవలెను. మంగళవారం కందులు దానం ఇవ్వవలెను. 2,3,4,7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారములు అదృష్టవారములు.

మొత్తం మీద రాశివారికి డిశంబరు వరకు అష్టమ గురుడు, సంవత్సరాంతము వరకు అర్ధాష్టమ శని ఉండుటవలన, రాబడికి మించిన ఖర్చులు, నమ్మినవారివలన మోసములు, జాయింటుదార్లతో విడిపోవుట, ఊహించని చికాకులు, వాతసంబంధమైన బాధలు కలుగుచుండును. వీరు శని, గురులకు జపములు చేయించి, దానములు ఇవ్వవలెను.
2008
1. ఏప్రిల్ : ధనాదాయమునకు లోటు ఉండదు. పాత బాకీలు వసూలగును. బంధువర్గములోని వారితో మన:స్పర్ధలు, జంతు భయం. అన్యస్త్రీ పరిచయం, శాస్త్ర సంబంధమైన విషయములయందు ఆసక్తి.
2.మే : శిరస్సుకు సంబంధించిన బాధలు, చేయు కృషియందు అభివృద్ధి తక్కువ. బంధువర్గముతో విరోధము,
స్థలమార్పులు, వ్యసనములయందు ఆసక్తి.
3. జూన్ : నూతన వ్యక్తులతో స్నేయలాభములు, ఏదో ఒక విధముగా ధనము చేతికండుచుండుట, పరస్త్రీలయందు
వ్యామోహం.
4. జులై : భార్యాభర్తల మధ్య అవగాహన లోపించును. ప్రయాణకులలో అవరోధములు కలుగుచుండుట, ఆరోగ్య
విషయములలో ఉత్సాయము లేకపోవుట, చోరభయం, బంధువర్గముతో విరోధం, స్థిరాస్థి అమ్మకం, నమ్మినవారి వలన మోసములు, అనవసర ధనవ్యయం.
5. ఆగష్ట్ : మానసిక ఆందోళన, అధికారుల వలన భయం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట, ప్రయాణముల
రీత్యా ధనవ్యయం, స్త్రీల వలన అవమానములు కలుగుట, ఆయుధముల వలన దెబ్బలు తగులుట, స్థిరాస్థి
విషయములో తగాదాలు.
6. సెప్టెంబరు : ధనాదాయమునకు లోటు ఉండదు. నూతన వ్యక్తులతో పరిచయం, స్త్రీలతో విరోధము, చేయు కృషియందు అభివృద్ధి, ఉదర సంబంధమైన బాధలు.
7. అక్టోబరు : క్రయ విక్రయముల వలన ఆదాయము పెరుగును. పుణ్యక్షేత్ర సందర్శనం, వాహన సౌఖ్యం, భార్యతో
మన:స్పర్ధలు, మన:శాంతి తక్కువా నుండును.
8. నవంబరు : మన:స్థిమితము లేకపోవుట, చంచల మనస్సు, నమ్మిన వారి వలన మోసములు, బంధువర్గముతో
విరోధము, భార్యాభర్తల మధ్య ఎడబాటు, శ్రమతో పనులు నెరవేరుచుండుట, ఏదో ఒక విధముగ సొమ్ము చేతి కందుచుండును.
9. డిశంబరు : అన్నదమ్ములతోను, ప్రభుత్వాధికారులతోను చికాకులు, స్థలమార్పులు, పని వత్తిడి ఎక్కువగుటవలన
తిండి, నిద్ర సరిగా ఉండవు. ఉద్యోగరీత్యా క్రిందివారివలన అవమానములు, వాయన ప్రమాదము.ఉ.
2009
10. జనవరి : వ్యసనములయందు ఆసక్తి పెరుగును. ఊహించని సంఘటనల వలన ధనవ్యయ మగుచుండును. శరీరమందు అనారోగ్యత, ఆయుధముల వలన దెబ్బలు తగులుట, వైద్య రీత్యా ధనవ్యయం.
11. ఫిబ్రవరి : ధనవ్యయముతో పనులు నెరవేరుచుండును. కుటుంబములోని వారికి అనారోగ్యం, స్త్రీలయొక్క సహకారముతో వ్యవహారములు పరిష్క్టారమగుచుండును. నూతన వ్యక్తులతొ స్నేహలాభములు.
12. మార్చి : ధనాధాయము బాగుండును. పాత బాకీలు వసూలగును. శుభకార్య ప్రయత్నములు కలసి వచ్చును.
స్థానచలనము కలుగుట, అధికారుల వలన మాటలు పడుట జరుగును.

వీరి అదృష్ట సంఖ్య 6


---శ్రీ నేమాని వారి గంటల పంచాంగము.