శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా ... ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసరించే మాసం "ఆషాడమాసం" చాంద్రమానం ప్రకారం "ఆషాడమాసం" నాలుగవ నెల. ఈ మసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలోగానీ,ఉత్తరాషాఢ నక్షత్రం సమీపంలోగానీ సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి "ఆషాఢ మాసం" అనే పేరు ఏర్పడింది.

రోజూ కాకపోయినా ఆషాఢ మాసంలో శుక్లపక్ష షష్టినాడు శ్రీసుబ్రహ్మణ్యసామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.


ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి.ఆషాఢంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలువుతుంది.

కాగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చే విషయం వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అతాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం. కాని సామాజికంగ ,చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టేవరకు చైత్ర,వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.


ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్యదినాలు ఉన్నాయి.

శుక్లపక్ష ఏకాదశి : తొలి ఏకాదశి

దీనికే ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూ పేరు. శ్రీ మహావిష్ణువు ఇ దినం ఒదలుకుని నాలుగునెలలపాటు పాల కడలిలో శేష శయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణూవు పూజించాలి.మరునాడు ద్వాదశినాడు తిరిగి శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదములు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది.

శుక్లపక్ష పూర్ణిమ : వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమ

శ్రీ వేదవ్యాసుల వారి జన్మదినంగా చెపబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని, కృష్ణుడిని ,గురుపరంపరను పూజించాలని శాస్త్ర వచనం.

కృష్ణ పక్ష అమావాస్య : దీప పూజ

ఆషాఢమాసం చివరి రోజు అయిన అమావాస్యనాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను వుంచి వెలిగించి పూలు, లడ్డులు సమర్పించవలెను. సాయంత్రం కూడా దీపం వెలిగించాలి.