౧. సుషేణుడు, సత్యసేనుడు, వృషసేనుడు, చిత్రసేనుడు, సుశర్ముడు .. ఈ అయిదుగురూ భారతంలో ఏ వీరుని కొడుకులు?
జ. కర్ణుని కొడుకులు.

సుషేణుడు, సత్యసేనుడు కర్ణుని చక్ర రక్షకులు. వృషసేనుడు అర్జునుని చేత, సత్యసేనుడు భీముని చేత, సుశర్ముడు,చిత్రసేనుడు నకులుని చేత, సుషేణుదు సాత్యకి చేత యుద్ధంలో చంపబడ్డారు.


౨. పుష్పకవిమానం సొంతదారు ఎవరు?

జ. కుబేరుడు.

పుష్పకవిమానం ఆకాశంలో సంచరిస్తుంది. దీనిని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. కుబేరుని విమానం ఇది. రావణుడు దీనిని బలాత్కారంగా తీసుకుంటాడు. రావణ సంహారం తర్వాత రాముడు ఇదే విమానంలో అయోధ్యకు వెళ్లి తిరిగి కుబేరునికి ఇచ్చేస్తాడు.

౩. ప్రియునిచే వంచింపబడి రాయబారము పంపే స్త్రీని ఏ విధమైన శృంగార నాయిక అంటారు?

జ. విప్రలభ్ద.

అష్టవిధ శృంగార నాయికలలో..

చెప్పినట్టు విని కోరినట్టు నడుచుచూ భర్త గలది స్వాధీన పతిక.

ప్రియుని రాకకై పడకగదిని అలంకరించేది వాసవ సజ్జిక.

సంకేత స్థలానికి ప్రియుడు రాలేదని విరహవేదన పడేది విరహోత్కంఠిత.

ప్రియునిచే వంచింపబడి రాయబారం పంపే స్త్రీ విప్రలబ్ధ.

భర్తయందు పరస్త్రీ గమనం చూసి ఈర్ష్యపడేది ఖండిత.

భర్తను అవమానించి ఆపై పశ్చాత్తాపపడేది కలహాంతరిత.

దేశాటనలోనున్న భర్తను తలచుకొనేది ప్రోషిత భర్తృక.

చక్కగా అలంకరించుకొని సంకేత స్థలానికి ప్రియునికై వెళ్ళేది అభిసారిక.

౪. బుద్ధుడు తన జ్ఞానోదయమైన పదహారవ ఏట ధాన్యకటకములో ప్రవచింపజేసిన మూడవ ధర్మచక్రం పేరేమిటి?
జ. వజ్రయానము.

హీనయానం, మహాయానం, వజ్రయానం అనే సంప్రదాయాలు మూడు భౌద్దానికి చెందినవి. భట్టిప్రోలు పరిసరాలలో వజ్రయాన చాయలు లేకపోయినప్పటికి భట్టిప్రోలు స్థూపం యధార్ధమైన భుద్ధ ధాతువుపై నిర్మింపబడినట్టుసృష్టమవుతుంది.

౫.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిది గరళమనియు, మేలని ప్రజకున్
మ్రింగమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో
ఈ పద్యం రాసిందెవరు??

జ. బమ్మెర పోతన.

భాగవతంలో క్షీరసాగర మధన ఘట్టంలో పోతనగారు రాసిన పద్యం. సముద్ర మధనంలో హాలాహాలం పుట్టినప్పుడు ఆ గరళం శివుడు మింగడానికి పార్వతి అన్నీ తెలిసే ఒప్పుకుందంట.ప్రజలని రక్షించడం కోసం, విషం మింగెయ్యి అని ప్రోత్సహించిందంట. అమ్మవారిని
’సర్వమంగళ’ఆనడంలో వుంది ఆయుపట్టు. నిజంగానే తన మంగళసూత్రం మీద ఆమె నమ్మకం అంతటిదంటారు పోతన.