విధవ గంగా భాగీరధీ సమానురాలు ఎలా అయింది???
నదుల్లో గంగానది అతి పవిత్రమైనదని భారతీయుల ప్రగాడ విశ్వాసం.అందుకనే దేశం నలుమూలల నుంచీ హిందువులు పవిత్ర గంగా స్నానం చెయ్యడానికి కాశీ, ప్రయాగ, హరిద్వారం, గంగోత్రి, గోముఖం వెళ్తారు. గంగా నదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళనం ఔతుందని వారి నమ్మకం. మహేశ్వరుడంతడివాడే గంగను నెత్తిన పెట్టుకున్నాడు. అనునిత్యం తనకు అభిషేకం చేయించుకుంటాడు.

ప్రజా జీవితంలో గంగ అంతటి పవిత్ర స్థానాన్ని అధిష్టించింది. అంతటి పవిత్ర గంగమ్మ తల్లితో విధవరాల్ని "గంగాభాగీరధీ సమానురాలు" గా పోలుస్తారెందుకు??

విధవను శ్రీమతి అనరు. సౌభాగ్యవతి అనరు. మహాలక్ష్మి సమానురాలని కూడా అనరు. విధవను గంగాభాగీరధీ సమానురాలనే వ్యవహరిస్తారు. గంగ విధవ కాదే! విధవ, గంగతో సమానురాలు ఎలా అవుతుంది?? గంగ పవిత్రతకి ప్రతీక ఐతే విధవ అశుభానికి సంకేతం. విధవను గంగను సమానులుగా సరిపోల్చే ఈ సాంప్రదాయం ఎలా వాడుకలోకి వచ్చింది??

భర్తను పోగొట్టుకొని అనాధ అయిన స్త్రీ పట్ల అందరూ పూర్వం కంటే మరింత పవిత్రతా భావంతో ప్రవర్తించాలన్న ఉద్దేశంతో మన పూర్వజులు విధవను గంగమ్మ తల్లితో సరిపోల్చారు. ఇక్కడ విధవ గంగతో సరిపోల్చబడింది కాని గంగను విధవతో సరిపోల్చినట్టు కాదు. భర్త చనిపోయాక మగదక్షత లేని విధవకు సామాజిక రక్షణ కలిగించే సదుద్దేశ్యంతో ఆమెకు గంగతో గంగతో సమానమైన పవిత్ర స్థానాన్ని ఆపాదించారు.

ఈ విషయంపై వేరొక కథనం కూడా ఉంది. "గంగ" అంటే 'భాగీరధీ" అన్న అర్ధమే గాక గంగా శబ్దాన్ని విశేషణంగా తీసుకుంటే "పూజ్యమైన" అన్న అర్ధం ఉంది. విధవ గంగా భాగీరధీ నదులంతటి పునీతమైనదన్న భావంతో విధవను గంగా భాగీరధీ సమానురాలని పూజ్యభావంతో వ్యవహరించడం అనూచానంగా వస్తున్న ఆచారం. ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది.


"గంగ" అంటే నీరు కదా! నిలువెల్లా నీరే అయిన గంగమ్మ పుణ్యస్త్రీ అయినా బొట్టు పెట్టుకోవడానికి ఆమెకు అవకాశం లేదు. ఆపాదమస్తకం శరీరమే నీరయినప్పుడు నీటిలో బొట్టు నిలిచేది ఎలా?? సృష్టిలో బొట్టు పెట్టుకో(లే)ని ఏకైక సుమంగళి గంగమ్మ తల్లి ఒక్కర్తే! భర్త ఉండీ, పునిస్త్రీ అయిన గంగకు, భర్తని పోగొట్టుకుని బొట్టు పెట్టుకునే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంది విధవ. "బొట్టు" అంటే నుదుటను పెట్తుకునే "తిలకం" అనే కాదు. "పుస్తె,తాలిబొట్టు" అన్న అర్ధాలు కూడా ఉన్నాయి. బొట్టుకి, తాలిబొట్టుకి అంతటి అవినాభావ సంబంధం ఉంది. బొట్టు విషయంలో బొట్టు(తాళి) ఉన్న గంగకూ విధవకూ సామ్యమున్నది!అందుకనే విధవను గంగా భాగీరధీ సమనురాలనడంలో ఔచిత్యం అర్ధం అవుతున్నది కదా!