ప్ర. సీతారాముల కళ్యాణం, పార్వతీ కళ్యాణం అంటారే కాని వివాహం అనరేమిటి? వివాహానికి, కళ్యాణానికి తేడా వుందా?
జ. వివాహం, కళ్యాణం రెండూ సమనార్ధకాలే. ఐనా భగవంతునికి చేసే ఈ కైంకర్యాన్ని లోకకళ్యాణకరమని భావించి కళ్యాణమని పిలుస్తున్నారు. వివాహం అన్నప్పుడు ఈ అర్ధం రాదు కదా??



ప్ర. యజ్ఞోపవీతం బ్రహ్మచారికి మూడు ముడులు, గృహస్థుకు ఐదు ముళ్ళూ విధించడంలో ఆంతర్యం ఏమిటి?
జ. యజ్ఞోపవీతం అనగానే వేదవిహిత కర్మలు చేయడానికి అవసరమైన ధారణ, బ్రహ్మచారిగా వున్నప్పుడు ఒక్క ముడి చాలు . గృహస్థు అయినపుడు ఔపాసన, వైశ్వదేవ, శ్రౌతకార్యాదులు చేయవలసి వున్నవాటికై మరి రెండు ముడులను ధరించడం అవసరం. ఇందులోని ఏ ఒక్కటి తెగినా ఇబ్బంది లేకుండా వుండటానికి నాలుగు, ఐదు ముడులు వాడుతున్నారు.


ప్ర.దశరథ తనయులలో ఎవరి పేరుకూ ముందు చేర్చని శ్రీ అనేది ఒక్క రామచంద్రునికి చేర్చడం ఏమిటి?
జ. సాధారణంగా పేరుకు ముందు శ్రీ చేర్చడం మర్యాద. కాని శ్రీరామచంద్రమూర్తికి శ్రీ చేర్చి తీరాలి. కారణం " శ్రీయన సీతగా బరగు " అని గోపన్నగారు తన శతకంలో చెప్పారు.ఇది రామావతార ప్రత్యేకత. మాయా మానవ అవతారమని ప్రసిద్ధి. సీతారాములను విడిచేసి పిలిచే నామంగాని పలికే మంత్రం కాని అప్రశస్తమవుతుంది. సీతారాముల ప్రత్యేకతకు నిదర్శనంగా రామావతారానికి ఇది పెద్ద గుర్తు. అందువల్ల రామకోటి రాయాలన్నా ముందుగా శ్రీరామ అని రాయాలి.


ప్ర.శృతి-స్మృతి అంటే ఏమిటి? ఆధ్యాత్మికం అనగానేమి?
జ. "శృతి" అంటే అపౌరుషేయమైన వేదం."స్మృతి" అంటే స్మరించినది అని అర్ధం. అనగా వేదాన్ని గ్రహించి తత్త్వజ్ఞులైన మహర్షులు, జీవులకు శుభాన్ని కలిగించడానికి స్మరించినది అనగా ధర్మశాస్త్రములు. ఆత్మ స్వరూపాన్ని వివరించేది ఆద్యాత్మికం.