కామినీ కాంచనములు కంటబడిన "బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు " అని జనబాహుళ్యంలో బహుళ ప్రచారం పొందిన లోకోక్తి ఒకటుంది. దీని వెనుక నిగూఢమైన ఒక ఇతిహాసిక ఉదంతం ఉంది.

కామిని కవ్వింపుటందం కామాన్ని ప్రకోపింపచేస్తుంది. ఎంతవారలైనా కాంతదాసులే కదా. కామ ప్రకోపం కన్ను మిన్ను కానదు. వావివరుసలు చూడదు. సమయాసమయాలు గుర్తించదు. ఉచితానుచితాలు పట్టించుకోదు. అందుకే " కామాంధోహి న పశ్యతి " అన్నారు పెద్దలు.

బ్రహ్మ సృష్టి సంకల్పించినప్పుడు జరిగిన ఉదంతమిది. బ్రహ్మ దేహం నుంచి ముందు ప్రజాపతులావిర్భవించారు. తర్వాత బ్రహ్మ వక్షస్థలం నుంచి ధర్మం, వీపు నుంచి మృత్యువు, ఆత్మ నుంచి కామం పుట్టేయి. నోటి నుంచి సరస్వతి పుట్టింది. అప్పుడేం జరిగిందంటే --

…అబ్జజు డాత్మ దేహమున జనించిన
భారతి జూచి విభ్రాంతి బొరసి…

తన నుంచి పుట్టిన సరస్వతి సమ్మోహన రూపాన్ని చూసి, వివశుడైన బ్రహ్మ కూతురితో జత కట్టడానికి ఆమె వెంట పడ్డాడట. సృష్టికర్త బ్రహ్మే వావి వరుసలు పాటించకుండా కూతురైన సరస్వతితో ఉన్మత్తుడైనప్పుడు అతని చేత సృష్టించబడ్డ మానవులు కామాంధులు కాకుండా ఉంటారా? ఇదే మాట మరీచి ఆదిగా గల మునులందరూ బ్రహ్మను కటువు మాటలతో నిలదీసి నిందించారంట.

అంతమంది మునివర్యుల కఠినోక్త్లులకు గురయిన బ్రహ్మ సిగ్గుతో తలదించుకుని వెంటనే దేహత్యాగం చేసాడు. తర్వాత మళ్ళీ జన్మించి సృష్టికార్యంలో నిమగ్నుడయ్యాడు.ఈ కథలో బ్రహ్మ కూతురితో సమానమైన సరస్వతి పొందు కోరేడన్న ఉదంతం కేవలం అర్ధవాదం కథా చమత్కృతి మాత్రమే. ఇందులో వేదార్థానికి, వ్యావహారిక అర్ధానికి బేధం చెప్పబడింది.

బ్రహ్మ సృష్టి మొత్తాన్ని తననుంచి వాక్కుగా ఉచ్చరించాడు. అదే వాగ్దేవి సరస్వతి. ఆ తర్వాత తను ఉచ్చరించిన వాక్కులో తనే వాగర్ధంగా ప్రవేశించినాడు. ఈ ప్రక్రియనే బ్రహ్మ కూతురైన సరస్వతి వెంటపడటమని కథగా చమత్కరించబడింది. ఇది కేవలం కావ్య చమత్కృతి మాత్రమే.

మరీచి మొదలైన మునులు బ్రహ్మను అభిశంసించడమంటే ఉచ్చరించడానికి పదాలు, వాక్యాలు, విభక్తులు, అర్ధాలు, మొదలైన వాక్యోపకరణాలు,, కర్త, కర్మ క్రియా రూపాలు ఉచ్చారణకి, అభిప్రాయానికి మధ్య నిలబడడం.

’మృగ ’ శబ్దానికి లేడి అనే కాక ఋతువని శ్లేషార్ధం ఉంది. బ్రహ్మ సృష్టిని భౌతికంగా కల్పించవలసి వచ్చినపుడు రూపం, అందం అన్నవి పుట్టాయి. స్త్రీ , పురుష భేదాలు తప్పనిసరి అయ్యాయి. రెండింటిలోనూ తానే అంతర్యామిగా ఉన్నాడు. నామ రూపాధికమైన సృష్టి అతని ఉచ్చారణగా ప్రసరించే వాక్కుగా వెలువడింది. ప్రసరించి వచ్చినది కనుక ప్రవాహం లేక సరస్వతి అనబడింది. ఆమె వివిధ రూపాలుగా ప్రసరించినది గాని తానుగా లేదు. అన్నింటనూ అంతర్యామిగా బ్రహ్మ ఉండాలంటే బ్రహ్మ ఆ రూపాల వెనుక పడాలి. ఆ రూపాల్తో సంగమించాలి. హల్లుతో అచ్చు సంగమించినపుడే అక్షరం పుడుతుంది. అప్పుడు ఉచ్చారణకి అభిప్రాయానికి మధ్యపదాలు, విభక్తులు, కర్త,కర్మ,క్రియాది వాక్య భావ ఉపకరణాలు చేరుకుని వాక్య నిర్మాణం, భావ వ్యక్తీకరణం జరుగుతుంది.

బ్రహ్మ దేహత్యాగం చేయడమంటే శబ్దం నుంచి అర్ధాన్ని విడదీసి భావం లేకుండా మధ్యస్థంలో విడిచి పెట్టడంతో శబ్ద సృష్టి ఏర్పడి, అర్ధంతో సంబంధం లేకుండా శబ్దం భాషలోని భాగంగా స్థిరపడటం సంభవించినది అన్నమాట.

బ్రహ్మ మళ్ళీ జన్మించడమంటే బ్రహ్మ ఉచ్చరించిన శబ్దం ఆకాశమార్గాన వేర్వేరు దిశల్లో విస్తరించి భిన్న భిన్న భాషల ఆవిర్బావానికి శ్రీకారం చుట్టడమే.

ఇదే బ్రహ్మ, కూతురైన సరస్వతి వెంట పడ్డాడన్న కథా చమత్కృతిలో నిక్షిప్తమైన గాధ.