మేడసానివారి పంచసహస్రావధానం


ఇటీవల హైదరాబాదులో జరిగిన మేడసాని మోహంగారి పంచసహస్రావధానంలోని కొన్ని చమత్కారాలు.

అవధానం అంటే ఏకాగ్రత,అప్రమత్తత, అష్టావధానం అంటే ఎనిమిది మందితో నిర్వహించే ప్రక్రియ.

"సారాగొనె శివుడు లోక సంరక్షణకై" ఏమైనా అర్ధమైందా?

పారావారమున నందున
నారని పెనుజిచ్చువోలె హాలాహలమే
పారగ నద్దానిని 'మన
సారా' గొనె శివుడు లోక సంరక్షణకై


ఇంగ్లీషు నెలలతో శ్రీరాముడిపై పద్యం....

'జనవరి 'ష్టుడు శ్రీరామచంద్రమూర్తి
'మే'లు గూర్చుట వ్రతముగా మెలగినాడు
మహిని రాక్షసులం బరి 'మార్చి 'నాడు
సూర్యవంశపు 'జూలయి ' శోభలీనే.



సమస్యా పూరణంలో చివరి పాదం ఇలా ఉంది. మొదటి మూడు పాదాలు పూరించాలి.
రావణుని పత్ని సీతమ్మ రాము చెల్లి.
సీతమ్మ రావణుడికి భార్య,రాముడికి చెల్లెలు అవుతుందా?


సీత రాకడ నెదిరించెనే తరుణీయ?
రామ కథలోని శక్తి యే లేమ చెపుమ?
భరతు డమ్మాయి వరసైనచో వరుస వరుస -
రావణుని పత్ని, సీతమ్మ, రాము చెల్లి


ఎంత అద్భుతమైన పూరణ. సీతను తీసుకురావడం తగదని చెప్పినదెవరు? రామకథలోని కథానాయిక ఎవరు?భరతుడు అమ్మాయిగా పుడితే రాముడికి ఏమవుతుంది? అని మొదటి మూడు పాదాల్లో ప్రశ్నించి వాటికి సమాధానాలు నాలుగో పాదంలో ఇచ్చారు.


పంచరు,టించరు, వెంచరు, లాంచరు పదాలతో భారతీయ సంస్కృతి గురించి వర్ణించమంటే...

పంచరు ద్వేషభావనలు భారత వీరులు, కల్మి లేమి పా
టించరు, అందరున్ కలిసి డీకొని శత్రు సమూహ శక్తి లా
వెంచరు, పోరులోని అరిభీకరమూర్తులు భారతంబ చే
లాంచరుచి ప్రతీకలు భళా! మన సంస్కృతి సంస్తుతంబగున్




అవధాని ఏకాగ్రతను చెడగొట్టేందుకు చేసిన అప్రస్తుత ప్రసంగం...

అవధానిగారూ భర్త భోజనం చేస్తున్నాడు. భార్య వడ్డిస్తోంది. భర్త 'పశువ ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి ' అంది. వారి మాటలలో ఆంతర్యమేమిటీ '

దానికి అవధాని ఇలా చెప్పాడు.

' ళ్ళెం నిండా శు భ్రంగా డ్డించవే ' అని భర్త అడిగితే ' కో రినంత తి నండి ' అని భార్య జవాబిచ్చింది.