om.jpg"ఓం" - ఇదే మూల మంత్రం. ఏ మంత్రం ఉచ్చరించించాలన్న్నా ముందు 'ఓం' చేరుస్తారు. ఓంకారంతోనే సామవేదం గానం చేస్తారు. ఓంకారంతోనే ఏ శాస్త్రమైనా మొదలవుతుంది. ఓంకారంతోనే యాజ్ఞికులు యజ్ఞం మొదలుపెడతారు. ఓంకారంతోనే బ్రహ్మ ఈ విశ్వసృష్టిని ప్రారంబించాడు. చాలామంది ఓంకారం అంటే ధ్యానానికి, యోగాకు ముందూవెనకా వాడుకునే పదమే అనుకుంటున్నారు. మరికొందరు ఓంకారాన్ని పవిత్ర మత చిహ్నంగా పరిగణిస్తున్నారు. ఇంకా కొంతమంది ఓంకారాన్ని మంత్రపూరితమైన శబ్దం మాత్రమే అని భావిస్తున్నారు. ఓం ఒక పదం కాదు. ఓంకారం ఈ విశ్వాన్నంతటినీ చలింపచేసే ఒక శబ్దం. ఈ శబ్ద చలనాన్ని మన పూర్వ గురువులూ, ప్రాచ్య విజ్ఞానవేత్తలూ అయిన ఋషులు కనుగొన్నారు.


గొప్ప పండితురాలు, భగవద్గీత అనువాదకుతాలు అయిన బార్బరా స్టోలర్ మిల్లర్, " ప్రతివాక్కూ, భావం ఓం నుంచే పుట్టాయి. అది విశ్వరహస్యాన్ని బోధిస్తుంది" అంటారు. ఆధారభూతమైన శక్తి ఏర్పరిచే ప్రకృతి చలనంవల్ల,ఈ విశ్వసృష్టి జరుగుతుందని వేదాలు చెప్తున్నాయి. ఆ శక్తే 'ఓం". ఓంకారం ఈ సృష్టికర్తకు శబ్దరూపం. అందులోనుంచి ఈ విశ్వం మాత్రమేకాదు, నిత్యమూ, నిరుపమానమైనవీ ఎన్నో జన్మిస్తాయి. మాండూక్య ఉపనిషత్, ఓంకార గొప్పదన్నాన్ని ఇలా వివరిస్తోంది. " ఓం నిత్యమైన శబ్దం. ఓం అంటే విశ్వం. ఓం తత్వ విచారం ఇదే! భూత, బవిష్యత్, వర్తమానాలు; ఉన్నవి, ఉండబోయేవి, ఉంటున్నవి అన్నీ ఓంకారమే! అలాగే కాలంతో సంబంధం లేకుండా, ఈ విశ్వంలో జరిగే సృష్టి అంతా ఓంకారమే" వేదమంత్రాలన్నీ ఓంకారం నుంచే వచ్చాయి.'జాగ్రదావస్థలోని, జీవనంలోని అత్యున్నతమైన, శబ్దరూపమైన మంత్రం ఓంకారం,


మన ప్రాచీన మతగ్రంధాలు కూడా ఓంకారం అనే విశిష్ట శబ్దాన్ని మిగిలిన అన్ని మంత్రాలకూ ఆధారమని చెప్తున్నాయి. ఈ ఓంకారం అనే శబ్దం సృష్టికే కాదు లయకు కూడా కారణమవుతుంది. యోగులు ఓంకారాన్ని ప్రణవమంటారు. అది ప్రాణచలనానికి కారణమవుతుంది. యోగులు ఈ ఓం అనే ప్రణవమే మానవ మేధస్సు వెనక వుండే శక్తి అని, అదే మనిషి ఆలోచించడానికి, కదలడానికీ, స్పర్శను అనుభవించడానికి, దేన్నైనా ఆచరించడానికీ ఆధారం అంటారు. సరైన ఉచ్చారణ వల్ల విశ్వవ్యాప్తమైన శబ్ద చలన తరంగాలు ప్రతి మనిషిలోనూ ఉన్నాయన్న విషయం గ్రహించవచ్చు. వ్యక్తిలోని ఓంకారం స్థూల,సూక్ష్మ,ప్రాణమయ శరీరాలను అధిగమించి ఉంటుంది. అది నిద్రావస్థ, జాగ్రదా వస్థ, స్వప్నవస్థలకు అతీతమయింది. మానవుడు ప్రతి ఉచ్చ్వాస నిశ్వాసాల్లోనూ తన ఇచ్చ లేకుండా అప్రయత్నంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే ఉంటాడు. ఓంకారంలో ఉన్న మూడు అక్షరాలు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలు.ఓంకారంలోని మొదటి అక్షరం 'అ ' దీన్ని అమ్మలో 'అ ' లాగ పలకాలి. ఇది జాగ్రదావస్థను తెలియ జేస్తుంది. రెండవ అక్షరం 'ఉ ' దీన్ని ఉడుతలో ' ఉ ' లాగ పలకాలి. ఇది స్వప్నావస్థను చెప్తుంది. మూడవ అక్షరమైన ' మ్ ' (o) లా పలకబడి, వ్యక్తి చేతన సుషుప్తిలో పొందే అనుభవాలను గ్రహించేసే సమర్ధత కలిగి వుంటుంది.


సంస్కృత లిపిలో ’ఓం’ రాసినప్పుడు ఆ అక్షర ఒంపులో ఎన్నో విశేషాలున్నాయి. ఒక్కొక్క ఒంపూ ఒక్కొక్క విశేషాన్ని చెప్తుంది. పెద్దదిగా ఉండే క్రింది ఒంపు జాగ్రదావస్థను తెలియ జేస్తుంది. అంటే భౌతిక ప్రపంచానుభూతుల్ని పొందుతామన్నమాట. పై ఒంపు ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయే సుషుప్తిని చెప్తుంది. ఈ రెండూ కలిసే చోట ఉన్న మరొక ఒంపు, భౌతిక ప్రపంచంలో మనం చూసిన వస్తువుల నీడలు కదలాడే స్వప్నావస్థను వివరిస్తుంది. ఈ మూడు ఒంపులనుంచి వేరై, ఒక అర్ధ చంద్రాకారంపైన ఒక బిందువు వుంటుంది. అది నాలుగో స్థితి అయిన పూర్ణ జ్ణానాన్ని లేదా తురీయాన్ని చాటుతుంది. ఆ అర్ధచంద్రాకారం నిరామయాన్నిచాటుతూ ఈ భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని తెంపుకోనంతకాలం ఆ తురీయాన్ని చేరటం అసంభవం అంటూ ఉంటుంది.


ఓంకార మంత్రోచ్చారణ మానవ మేధస్సును, పరమాత్మను తెలుసుకోడానికి ప్రేరేపిస్తుంది.ఓంకారం ఎప్పుడుఉచ్చరింపబడ్డా సరే , ఒకసారి ఒంకార ఉచ్చరణ చేయడానికీ, మరొకసారి ఓంకారాన్నిపలకడానికి మధ్య తప్పనిసరిగా నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం నాల్గవస్థితి లేదా తురీయానికి ప్రతీక.అంటే ఆ స్థితిలో అనంతమైన కరుణవల్ల ఆత్మ తనకూ, పరమాత్మకూ గల అనుబంధాన్ని గ్రహించగలుగుతుందన్నమాట.