వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై

త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

రాగం : అమృతవర్షిణీ

ఓడల కడలిని చిలికిన మాధవుని కేశవుని
చంద్రాననలు కోరి చేరి స్తుతించి // ఓడల //
అల వ్రేపల్లెలో పరపొందిన ప్రకారమును
భట్టనాధుని పట్టి గోద చెప్పిన ముప్పది
పాటలు క్రమము తప్పక పాడెడివారు, అరుణనేత్రుడు
చతుర్భుజుడు, దివ్యముఖారవిందుడు
శ్రీమన్నారాయణుని కరుణను పొంది
బ్రహ్మానందము ననుభవింతురు గాక!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

ఆండాల్ తిరువడిగళే శరణం..
ఇతిశమ్

అలనాడు గోపికలు శ్రీ వ్రతము చేసి శ్రీకృష్ణుడిని పొందినట్లుగానే గోదాదేవి కూడా శ్రీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీరంగనాధుని భర్తగా పొందింది. వ్రతం సమాప్తమయ్యే సమయంలొో రంగనాధుడు గోదాదేవిని తాను వివాహమాడడానికి తీసుకురమ్మని ఆమె తండ్రిని ఆదేశించాడు. శ్రీరంగంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. భోగమును పొందిన రోజు కావును శ్రీరంగనాధుడు, గోదాదేవి వివాహం చేసుకున్న ఈ రోజును భోగిగా చెప్పుకుంటారు.

ఎంతో పవిత్రమైన అందరూ ఆచరింపదగిన ఈ వ్రతాన్ని నియమిత సమయంలో ఆచరించకున్నా రోజూ ఈ ముప్పై పాశురాలను మననం చేయడం చాలా మంచిది. ముక్తి దాయకం. అమ్మవారైన లక్ష్మీదేవిని పొందడానికి శ్రీమన్నారాయణుడు ప్రయత్నించాడని క్షీరసాగరమధనంలో చెప్పినట్టుగా మనము కూడా ఆ పరమాత్మను పొందాలి అని అనుకోకుండా ఆతడే మనను పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని ఈ అమృత మధనం గురించి ఈ చివరి పాశురంలో వర్ణిస్తున్నారు.

" నారాయణుడు లక్ష్మీదేవిని పొందడానికి ఓడలతో నిండిన క్షీరసాగరాన్ని దేవతలు , అసురులతో మధింపచేసాడు. అదేవిధంగా శివుడు, బ్రహ్మలకు కూడా గురువైన కేశవుని గోపికలు కీర్తించి, భక్తిశ్రద్ధలతో నియమానుసారంగా శ్రీవ్రతాన్ని ఆచరించి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందారు. ఆ ప్రకారంగానే శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన గోదాదేవి తామరపూవులు, చల్లని పూసలు మాలగా ధరించి రంగనాధుని పొందడానికి శ్రీవ్రతాన్ని ఆచరించి తమిళంలో ఈ ముప్పై పాశురాలను ఒక మాలగా తయారు చేసింది. ఆమె ఆచరించి కీర్తించినట్టుగానే ఈ పాశురాలను పాడేవారు పెద్ద శిఖరాలవంటి భుజాలు కలవాడు, పుండరీకాక్షుడు, దివ్యమైన ముఖసౌందర్యం కలవాడు, శ్రీపతియైన పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు..."

నారాయణుడు సముద్రమధనం జరిగేటప్పుడు క్షీరసాగరంలో తిరుగాడే ఓడలకు ఎటువంటి ఆటంకం కలగకుండా నేర్పుగా కూర్మావతారుడై చిలికాడు. ఎవరికీ కనిపించని ఆ ఓడలు గోదాదేవికి మాత్రమే గోచరించాయి. ఆ ఓడలే మన ఆత్మలు, సంసారమే ఒక మహా సముద్రము, ఆ సముద్రాన్ని నేర్పుగా చిలికేవాడే మాధవుడు. సముద్రాన్ని చిలికేటప్పుడు ఆతని కేశాలు అటుఇటూ ఊగాయంట. అందుకే కేశవుడైనాడు. పాలకడలిపై శయనించిన పరమాత్మ ప్రార్ధనతో ఈ వ్రతాన్ని మొదలుపెట్టి చివరకు ఆ క్షీరసాగరమధనాన్ని ప్రస్తావిస్తూ వ్రత సమాప్తి చేసి ఆ దేవదేవుని సాయుజ్యాన్ని పొందారు ఆనాడు ఆ గోపికలు, ఈనాడు గోదాదేవి.

ఈ ముప్పై పాశురాలను భావార్ధాలతో సహా భక్తితో అధ్యయనం చేసి ఆచరించినంత ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. శ్రీకి శ్రీ ఐన స్వామి ఆ శ్రీతో కలిసి మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. తనలో చేర్చుకుంటాడు. అన్ని వయసులవారు, అన్ని ఆశ్రమాలవారు, అన్ని వర్ణాలవారు, అన్ని ప్రాంతాలవారు, శ్త్రీలు, పురుషులు. అందరూ భగవంతుని ప్రాప్తికై ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన కోరిన కోరికలు తీరును అని గోదాదేవి ఫలశ్రుతిగా చెప్పింది గోదాదేవి..



ఈ తిరుప్పావై పాశుర టపాలకు ప్రేరణ, సహకారం.. చిత్రకవి ఆత్రేయ రచించిన తిరుప్పావై పూదండ. మరికొన్ని పుస్తాకాలు..