ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప

మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

రాగం: దేశి

ఎత్తిన కుండలు ఎదురుపొంగ, క్షీరము
ఆగకుండ అందించెడి అపర కామధేనువులు
ఎన్నో కల నందగోప తనయా మేలుకో! //ఎత్తిన //
ఓ వేదమూర్తీ! అప్రమేయా! వేదాతీతా!
నిలచి వెలిగెడు నిఖిల జ్యోతి!
ఆశ్రితరక్షకా! మేలుకో!
అరులు నీకు బలముడిగి అసహాయులై
నిన్ను చేరి నీ పదములు సేవించు లీల
అరుదెంచితిమి మేము నిన్ను కీర్తింప
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


గోపికల ప్రార్ధన విన్న నీలాదేవి లేచివచ్చి వారితో కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పుతుంది.


"పాలకై తీసుకువెళ్లిన కుండలు పొంగి పోరలేట్టుగా పాలను ఇచ్చే పెద్ద పెద్ద గోవులుకలిగిన నందుని ప్రియకుమారా! మేలుకో! ఈ లోకాన్ని ప్రకాశవంతం చేయడానికి ఆవిర్భవించిన జ్యోతి స్వరూపుడా! నిద్రలెమ్ము! నీ పరాక్రమానికి ఎదురు నిలువలేక లొంగిపోయిన శత్రువులు నీ ఇంటివాకిట నిలిచి దాస్యం చేసినట్టు మేము కూడా నిన్ను విడిచి ఉండలేక నీ వాకిట నిలబడి మంగళగానం చేయడానికి వచ్చాము స్వామి"



ఇక్కడ ధారాళంగా పాలు ఇస్తున్న గోవులు నందరాజుకు చాలా ఉన్నాయి. కలశాలలో పాలు పితికితే అవి నిండి పొంగి పొరలుతున్నాయి. ఇలా ఉదారంగా పాలిచ్చే గోవులు వేదాలు. అవి కలిగి ఉన్న నందుడు గురువు. ఆతని ఉపదేశించే భవంత్ స్వరూప విశేషాలే ఈ పాలు. వాటిని గ్రహించడానికి తీసికెళ్ళే కలశాలు శిష్యులు. గురువులు ఉపదేశించిన జ్ఞానంతో శిష్యుల హృదయాలలో నిండిపోయాయి. అటువంటి గొప్ప గోవులు కలిగిన నందగోపుని కుమారుడవైన కృష్ణా! ఆయన మాట విని మా దరికి రావయ్యా. ఎవ్వరికీ అందని పరబ్రహ్మతత్వమే జ్యోతిస్వరూపమైన శ్రీకృష్ణుడిగా అవతరించింది.. తనను ఆశ్రయించినవారిని రక్షించి మాట నిలుపుకోవడంలో దృఢమైన ప్రమాణము కలిగినవాడు పరమాత్మ. అసలు అతను రక్షిస్తాడనే ప్రగాఢ విశ్వాసం మనకు ఉండాలి. పరమాత్మను ద్వేషించేవారు, అహంకారం మమకారాలతో నిండినవారు, వైదిక ధర్మాలు పాటింపనివారు, భగవంతునికి దూరమై క్రూర శత్రువులవుతారు. మేము కూడా భాగవత్, భగవత్ ద్వేషము వంటి పాపాలు చేసి ఉంటాము. అందుకే నీ శరణుజొచ్చాము తండ్రీ..గోవులు నిత్యం స్రవిస్తూనే ఉంటాయి. కుండలను తీసికెళ్లి వాటి పొదుగుల క్రింద పెట్టగానే నిండిపోతున్నాయి. భగవంతుని రక్షణ కోరడం మన ధర్మము. మరి భగవంతుడిని కూడా అర్ధించాలా?అని ఆలోచిస్తే కోరి అందుకున్న భగవంతుని అనుగ్రహము ఆనందాన్ని ఇస్తుంది . అసలు ఆ కోరిక ఎప్పటికి మన మనస్సులో ఉండాలి. ఎవరికైనా అన్నింటికి భగవంతుడే శరణము అన్న గట్టి విశ్వాసము కలిగి ఉన్నప్పుడే శాంతి లభిస్తుంది. అన్నీ తానే అనుకుంటే ఎప్పటికీ అశాంతే..