పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: వలజి

బకాసురుని డంబమడచిన దామోదరుని
దుష్తరావణుద్రుంచిన శ్రీరాముని
నామము పాడగ కన్నెపడుచులు
నోము సీమను చేరి వేచి యున్నారు //బకాసురుని//
శుక్రుడుదయించెను - గురుడస్తమించెను
పక్షులదెకూసెనే - పడతిమేల్కాంచవె -
చల్లని నెట జలకాలు ఆడవే - కపటము వీడవే
మంచమ్ము విడిరావె - మాతోడ కలియవే!
జగతికే మంగలము కూర్చుమన శ్రీవ్రతమురోజు ఒక గోపికను నిద్రలేపడమేంటి అనిపించవచ్చు కాని గోపికలనే ఆళ్వారులను కీర్తిస్తూ నిద్ర మేల్కొలిపి వారిని తోడ్కొని ఆ పరమాత్మ సన్నిధికి చేరాలి అనే అద్భుతమైన భావం ఈ పాశురాలలో ఉంది. ఈనాడు మేల్కొలిపే గోఫిక నేత్రాలు చాలా అందమైనవి. అందరినీ ఆకర్షించే తుమ్మెదతో కూడిన తామరపూవులాంటి కళ్లు, లేడి చూపులు కలిగి ఉన్నది. ఈ నేత్ర సౌందర్యమే ఆ శ్రీకృష్ణుని తన వద్దకు తీసుకొస్తుందనే నమ్మకం కలిగి ఉన్నది. ఇక్కడ నేత్రమంటే జ్ఞానం. జీవుడు పరమాత్మకే చెందినవాడు రక్షింపబడేవాడు, దాసుడు అని తెలుసుకున్నవారు ఆ పరమాత్మను పొండడానికి ఎటువంటి ప్రయత్నము చేయరు. ఈ స్థితిలో ఉన్న గోపికను గోదాదేవి మేల్కొలుపుతుంది.

బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని, దుష్టుడైన రావణాసురుని చంపిన శ్రీరాముని కీర్తిని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ అప్పుడే వ్రతక్షేత్రానికి చేరారు. తుమ్మెద కలిగిన తామరపూవులలాంటి కళ్లు ఉన్న చినదానా! శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు. లేడి చూపులు కలిగినదానా! పక్షులు కూయుచున్నవి. ఈ శుభదినాన శ్రీకృష్ణవిరహం తీరి చల్లబడేట్టుగా నీటమునిగి స్నానం చేయకుండా ఇంకా శయ్యపై పడుకుని ఉన్నావా? ఓ సుకుమరి తొందరగా వచ్చి మాతో కలువుము...భగవంతుని తత్వాన్ని మన నుండి దూరం చేయడానికి వచ్చే శత్రువులే ఈ బకాసురుడిలాంటి రాక్షసులు. అమాయకంగా ఏమీ తెలియనట్టు బయటకు కనిపిస్తూ మనసులో మాత్రం కృష్ణుని చంపి తినవలెనని ఆలోచన కలిగి కొంగ రూపంలో నిలిచాడు బకాసురుడు. తనను అంతమొందించడానికి వచ్చినదని గ్రహించిన శ్రీకృష్ణుడు దాని నోటిని చీల్చి అంతమొందించాడు. ఒక విధంగా ఉన్నవారు వేరొక విధంగా కనపడాలని చేసే ప్రయత్నమే దంబము. దంబము కంటే ప్రమాదకరమైంది అహంకారము. ఇక్కడ ప్రస్తావించిన రావణాసురుడు అహంకారము. నేను కాని దానిని నేను అనేవిధంగా చెసేదే అహంకారం. అశాశ్వతమైన శరీరమే ఆత్మ అని ఆలోచన ఈ అహంకారం వల్లనే కలుగుతుంది. అది కలిగిన వెంటనే ఆత్మకు, పరమాత్మకు గల సంబంధం తెగిపోతుంది. బకాసురుని కృష్ణుడు, రావణాసురుని రాముడు సంహరించడం తమకోసమే అని గోపికలు ఆనందంతో కీర్తిస్తూ ఆనందిస్తున్నారు.శుక్రుడు ఉదయించడం, గురుడు అస్తమించడం ప్రాతఃకాలానికి ముందు వచ్చే గుర్తు. మనలో సాత్వికమైన భావం కలిగి, భగవంతుని వైపు మన బుద్ధి నిలవడానికి ముందుగా శుక్రుడనే జ్ఞానం ఆవిర్భవించి, అజ్ఞానమనే గురుడు అంతరించాలి. శుక్రుడు మృతసంజీవని విద్యకలిగినవాడు. శుక్రుని పూజించి మనము అమృతత్వం సాధించడం అంటే చావు లేకుండా ఉండడం కాదు ఆ భగవంతునికి దూరం కాకుండా ఉండడం. అసురులను ఆకర్షించడానికి నాస్తిక మతాన్ని ప్రచారం చేశాడు గురుడు. అతను అస్తమిస్తున్నాడంటే మనలోని నాస్తిక భావాలు నశించి భగవంతునియందు నమ్మకం మొదలైనదన్నమాట. అందుకే ఇది చాలా మంచి సమయం నిద్ర లెమ్మని అంటున్నారు.