విజ్ఞాన శాస్త్రమని విఱ్ఱవీగుటెగాని
మరణింప బ్రతికించు వారెవరయ!
తక్కినవన్నియూ పశు పక్షులకు తెలుసు
వీరి గొప్పేమిటో చెప్పండయా!

దైవ మందరిలోన వున్నాడయా
అందరూ దైవమున లేరయ్యా
కనుకనే కష్టాలు పడియేరయ
కాటికెళ్ళేదాక యేడ్చేరయ!

మమకార మున్నపుడు భక్తెట్లు కల్గును
అహము వీడక నీకు జ్ఞానంబు కలుగదు
భక్తిజ్ఞానంబులే ముక్తికి మార్గము
ఈ పాప జలధిలో యెన్నాళ్ళు యీదేవు!

యెవ్వరికి లొంగను స్వతంత్రుడను నేను
అని విర్రవీగుతూ వుంటారయ
యింద్రియాలకు మనిషి బానిసై యుండగా
స్వతంత్రు డెట్లౌనో చెప్పండయా!

సత్కర్మ జేసిన భక్తి నీలో కలుగు
భక్తి వలన జ్ఞానముదయించురా
అడియాశలో బడి పాపకర్మలు జేయ
యమునివాకిట నీవు నిలిచేవుర!

సత్ప్రవర్తన లేక శివశివ యనినంత
యేమి ప్రయోజనము చెప్పండయ మందు
యెంతటిదైన పత్యమేలేకున్న
అదియెట్లు పనిచేయు తెలియండయా

గృహస్థులము మేము మోక్షసాధన జేయ
మాకెట్లు వీలుపడు ననియేరయ!
ధ్రువ ప్రహ్లాదులు గృహస్థులే కదా
వారెట్లు మోక్షమును పొందారయ!

కలిసొచ్చినప్పుడు సుఖమొచ్చినప్పుడు
దైవమును మరవక తలచువాడే ఘనుడు
అట్టివారికి కష్ట మెన్నటికి రాదయ!
కష్టమొచ్చినయపుడె తలచేరయా!

ప్రకృతీ పంటల వికృతంబుగ జేసి
పదివేల వ్యాధులను తెచ్చేరయా!
వింత గొలుపు వ్యాధి వైద్యులను యేడ్పించు
అంతు తెలియక ప్రజలు సచ్చేరయా!

ఈశాన్యదిక్కున విషగాలి వీచేను
లక్షలాది ప్రజలు సచ్చెరయా!
కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగా తూగి సచ్చేరయా!

ప్రకృతి శక్తికి మించిన వేగముతో
మానవుడు యంత్రాలు నడిపేరయా!
భూమిపై నున్నట్టి రక్షణ పొరబోయి
భూకంపమే వచ్చు తెలియండయా!

సాధువులు మేమనుచు శక్తి పూజలు చేయ
చంటిబిడ్డలబట్టి చంపేరయా!
నమ్మిచేరిన స్త్రీని వుపదేశమనుచు
నట్టేట ముంచేరు నమ్మండయ!