అభయప్రదాయిని గాయత్రీమాత ...
Filed under: తెలుసుకుందామా Author: జ్యోతిముగురమ్మల మూలపుటమ్మ గాయత్రి మాత. ఈ తల్లి ఎలా కనిపిస్తుందో చూద్దాం. పరమసౌందర్యం ఉన్న ఒక స్త్రీమూర్తి తన పీఠం మీద కూర్చుని ఉంది. ఆమెకి ఐదు శిరస్సులు. దేవతల శిరస్సులు వర్తులాకారంలో.. అంటే క్రమంగా తూర్పుని చూస్తూ ఒక శిరస్సూ, దక్షిణాన్ని చూస్తూ మరో శిరస్సూ.. ఇలా పశ్చిమ, ఉత్తరాల్ని చూస్తూ మరో రెండు శిరస్సులూ ఉండడమే కాక ఈ నాల్గింటికీ మధ్యగా అన్ని శిరస్సుల మీదా మరో శిరస్సు తూర్పుదిక్కును చూస్తూ కనిపిస్తుంది. అన్ని శిరస్సులకీ మూడు మూడు చొప్పున (కుడి ఎడమలు కాక రెంటికి మధ్యగా మరొకటి) కన్నులున్నాయి. అన్ని శిరస్సుల మీదా వేర్వేరుగా రత్నాలు పొదిగిన కిరీటాలు కనిపిస్తున్నాయి. అన్ని కిరీటాలకీ ఎడమభాగంలో చంద్రవంక ఉంది.
చిత్రమేమంటే అమ్మకున్న శిరస్సులు ఐదూ క్రమంగా ముత్యపు రంగుతో, పగడపు రంగుతో, బంగారపు రంగుతో, ఆకాశపు నీలివర్ణంతో, పూర్తి తెల్లని రంగుతో (అన్ని శిరస్సులకీ మధ్యగా ఉన్న పై శిరస్సు) కనిపిస్తాయి. ఇక ప్రధానంగా తూర్పు దిక్కుని చూస్తూ మనకి అభిముఖంగా ఉన్న అమ్మకి మాత్రం ఎడమవైపున ఐదూ, కుడివైపున ఐదూ కలిపి మొత్తం పది చేతులున్నాయి. అమ్మ చేతుల్లోని ఆయుధాలని అయిమూలగా అంటే ముందుగా ఎడమవైపు మొదటిచేతినీ, ఆ తర్వాత కుడివైపు మొదటిచేతినీ, ఆ తర్వాత మళ్లీ ఎడమవైపు రెండవచేతినీ, మీదట కుడివైపు రెండవచేతినీ ఇలా పరిశీలిస్తూ వెళ్తే క్రమంగా వరాన్ని ఇస్తుండే (వర+ద) హస్తం (చేతివేళ్ల కొనలు భూమివైపుకి ఉంటాయి.). ఆ మీదట భయం ఏమాత్రమూ లేకుండా చేసి మోక్షాన్నీయగలనని చెప్తూండే హస్తం (అ+భయహస్తం - చేతివేళ్ల కొసలు ఆకాశాన్ని చూపిస్తుంటాయి), మీదట క్రమంగా అంకుశం (ఎడమ రెండు), కొరడా (కుడి రెండు), కపాలం (ఎడమ మూడు), గద (కుడి మూడు), శంఖం (ఎడమ నాలుగు), చక్రం (కుడి నాలుగు) పద్మం (ఎడమ ఐదు. ఇదే విధంగా మరో పద్మం (కుడి ఐదు) కనిపిస్తున్నాయి.
యోగ సాధకుడు ఈ రూపాన్ని కళ్లలో ఉంచుకుని ధ్యానిస్తే ఆ తల్లి సాధకుని బుద్ధిని వికసింపచేసి తానే స్వయంగా మంత్రాన్ని హృదయంలో వినిపించేలా ఉపదేశానికి. ఆ వినిపించే వాణి పేరే .. 'శ్రీవాణి'
డా. శ్రీనివాసచారి.
No response to "అభయప్రదాయిని గాయత్రీమాత ..."
Post a Comment