ప్రధమోధ్యాయము


కురుక్షేత్ర సంగ్రామ రంగమున సైనిక పరిశీలనము

1.

ధృతరాష్ట్ర ఉవాచ:

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా

యుయుత్సవఃమామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయాః


అర్ధము : ధృతరాష్ట్రః = రాజైన ధృతరాష్ట్రుడు, ఉవాచా = పలికెను, ధర్మక్షేత్రే= యాత్రాస్థలమైన , కురుక్షేత్రే = కురుక్షేత్రమను పేరు గల దానియందు, సమవేతాః = కూడియున్నట్టి, యుయుత్సవః = యుద్ధము చేయ నాసక్తులై యున్నట్టి, మామకాః = నావారు (పుత్రులు), పాండవాః = పాండుకుమారులును, చ = మరియు, ఏవ = నిశ్చయముగా, కిం = ఏమి, అకుర్వత = చేసిరి, సంజయ = ఓ సంజయా.

అనువాదము : ధృతాష్ట్రుడు ఇట్లనెను. ఓ సంజయా! యాత్రాస్థలమైన కురుక్షేత్ర భూమియందు నా కుమారులును, పాండు కుమారులును పరస్పరము యుద్ధము చేయదలచి కలిసికొని ఏమి చేసిరి?

భాష్యము : భగవద్గీత ఒక ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. దేవాధిదేవుడైన శ్రీకృష్ణుడు దీనిని స్వయముగా అర్జునుడికి చెప్పుటచేత ఇది విశుద్ధమైనది. ఇతర శాస్త్రములందు చెప్పబడినదంతయును ఈ గీతయందు కనపడుతుంది. అంతేగాక ఇతర శాస్త్రములలో లేని విషయములు కూడా ఇందులో కానవచ్చును. అదియే భగవద్గీత యొక్క ఉచ్చస్థితి. మహాభారతమునందు వివరింపబడిన సంజయ ధృతరష్ట్రుల పరస్పర సంభాషణమే ఈ వేదాంతమునకు మూలము. దేవాధిదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుని పక్షమున కురుక్షేత్ర రంగమున ఉండుటచే అది ధర్మక్షేత్రమైనది. ధృతరాష్ట్రుడు తన కుమారుల విజయమై సందేహాస్పదుడై ఉండెను.అందుకే తనకు కార్యనిర్వాహకుడిగా ఉన్న సంజయునితో " నా కుమారులును, పాండు కుమారులును ఏమి చేసిరి?" అని ప్రశ్నించెను. కౌరవులు, పాండవులు, యుద్ధము చేయ కృతనిశ్చయులై కురుక్షేత్ర రణభూమిలో కలుసుకున్నారని తెలిసి కూడా ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న వేశాడు. స్వర్లోకవాసులు కూడ పూజింపదగిన పుణ్యభూమి కురుక్షేత్రం. ఆ పుణ్యభూమి మహిమవల్ల తన కుమారులకు అపజయము తప్పదని అతనికి భయము కలిగింది. అర్జునుడును తదితర పాండు పుత్రులును స్వభావసిద్ధముగ పవిత్రులైనవారు గనుక ఆ పుణ్యస్థలము వారిపై అనుగ్రహము చూపించునని అతని అభిప్రాయము. సంజయుడు వ్యాసుని శిష్యుడగుటచే గురుప్రసాదమువల్ల ధృతరాష్ట్రునికడ నున్నను యుద్ధభూమిలో జరుగుచున్నదంతయూ చూడ శక్తిగలిగి యుండెను. పొలములో పనికిరాని మొక్కలను తీసివేసినట్లుగా పుణ్యస్థలమైన కురుక్షేత్రములో ధర్మపితయైన కృష్ణుడు స్వయముగా ఉండుటచే దుర్యోధనుడు మొదలైన అనిష్టులైనవారంతా నశీంచురనియు, ధర్మనిష్టులైన యుధిష్ఠిరుడు మొదలైన సత్పురుషులే భగవంతునిచే నిలుపబడుదురనియు ఇట అవగతమవుతున్నది.