పెద్దల మాట ప్రస్తుతులే!..
Filed under: ఆధ్యాత్మికం Author: జ్యోతిపూర్వం ఒక సత్రయాగానికి బ్రహ్మ, శివుడు, దేవతలు, యోగులు, ఋషులు, ప్రజాపతులు అందరూ వచ్చి యజ్ఞశాలలో వారి వారి ఆసనాల్లో ఆశీనులై ఉన్నారు. దక్ష ప్రజాపతి కూడా ఆ యజ్ఞానికి వచ్చాడు. దక్షుడు జీవుల్లో అహంకార ప్రజ్ఞకి అధిపతి. దక్షుడు యజ్ఞశాలలోకి రాగానే, బ్రహ్మ, శివుడు తప్ప అందరూ అతని గౌరవార్ధం లేచి నిలబడ్డారు. అందరూ తనని చూసి లేచి నిలబడ్డారు కాని తన తండ్రి బ్రహ్మతో పాటు అల్లుడైన శివుడు కూర్చుని ఉండటం దక్షునికి కోపం కలిగించింది. పట్టరాని ఆగ్రహావేశాలతో దక్షుడు శివుని సభ్యులందరి ముందూ నిందించసాగాడు.
సీ. అనయంబు లుప్తక్రియా కలాపుఁడు మాన
హీనుడు మర్యాద లేవాఁడు
మత్త ప్రచారుఁడున్మత్త ప్రియుఁడు దిగం
బరుఁడు భూతప్రేత పరిన్నతుండు
దామస ప్రమధ భూతములకు నాధుండు
భూతిలిప్తుం దస్థిభూషణుండు
నష్ట శౌచుండు నున్మదనాధుఁడును దుష్ట
హృదయుఁ డుగ్రుఁడును బరేత భూని
తే. కేతనుఁడు వితతస్రస్తకుసుఁ డశుచి
యయిన యితనికి శివనాముఁడను ప్రవాద
మెటుల గలిగె నశివుఁడగునితని నెఱింగి
యెఱింగి వేదంబు శూద్రుని కిచ్చినటులు.
(శ్రీమద్బాగవతము, చతుర్ధ.43)
"ఇతడు దిక్పాలకుల కీర్తి చెడగొట్ట వచ్చినవాడు. వీనికి సభ్య ప్రవర్తన తెలియదు. పనిపాటులు లేనివాడు. ఇతనికి సిగ్గు లేదు. ఏ నియమాలు పాటించడు. మత్తెక్కి తిరుగుతాడు. పిచ్చివాళ్ళకి నాయకుడు. బట్టలు విప్పుకు తిరుగుతాడు . భూత ప్రేతాలే ఇతని సహచరులు. బూడిద పూసుకుని, ఎముకల్ని ఆభరణలుగా వేసుకుని జుత్తు విరగబోసుకుని తిరుగుతాడు. శుచి ,శుభ్రత లేదు. దుష్ట హృదయుడు, స్మశానమే ఇతని నివాసం, శివుడంటే శుభం కలిగించువాడు కదా! ఇతను అశివుడని తెలిసికూడా ఇతనికా పేరు పెట్టడం ఆ పేరుకే అప్రతిష్ట" ఇలా తిట్ల వర్షం కురిపించడమే కాక "ఇలాంటి వానికి యజ్ఞహవిస్సు దక్కకుండు గాక!" అని శివుని శపించేడు కూడా. ఈ ఉదంతంలో దక్షుడు శివుని దూషించినట్లు ద్యోతకమవుతున్నా. నిజానికి ఇందులో దూషణలేమీ లేవు. అతడన్న మాటలన్నీ మహాశివుని మహిమలను కొనియాడడమే. దక్షుడు అహంకారముతో అన్న మాటలు నిందించినట్టు ద్వనించినా అతడన్న ప్రతి మాట శివస్తుతే. శివుని పరతత్వాన్ని వివరించడమే.
దిక్పాలక్కుల కీర్తి చెడగొట్టిన వాడంటే అర్ధం అన్ని దిక్కులా తానే అంతర్యామిగా ఉన్నవాడు. క్రియాశూన్యుడంటే కర్మలకతీతుడు. సిగ్గులేనివాడంటే మనోవికారాలు లేనివాడు. మానమర్యాదలు లేనివాడంటే వాటికి అతీతుడు. మత్తెక్కి తిరుగుతాడంటే చిదానంద స్వరూపుడు. పిచ్చివాళ్ళకి నాయకుడంటే లౌకికసుఖాల్ని త్యజించి, వైరాగ్యం చెందిన వాళ్ళకి మార్గదర్శి. దిగంబరుడంటే దిక్కులే అంబరాలుగా కలవాడు. ఆకాశ శరీరుడు. తామసులకు నాధుడంటే తమోగుణానికి నియంత. ఎప్పుడూ బూడిద పూసుకుని తిరుగుతాడంటే జీవులు అంతమయ్యేక మిగిలేది చితా భస్మమే అని తెలియజెప్పడం.
ఎముకలే అతని ఆభరణాలంటే జీవులలో అంతర్యామిగా తానున్నప్పుడు వారి దేహనిర్మాణానికి ఆస్తికలే ఆధారభూతం అని అర్ధం. శుచి, శుభ్రత లేనివాడంటే అశుచిత్వం పొందనివాడు. దుష్ట హృదయుడంటే దుష్టుల హృదయాల్ని నియంత్రించేవాడు. ఉగ్రుడంటే శివుడు విలయకారకుడు గనక అతడు ఆయా సందర్భాల్లో ప్రళయ స్వరూపుడు. స్మశానమే నివాసంగా కలవాడంటే ప్రతి జీవికి అంతిమ నివాసం స్మశానమే అని స్ఫురింపజెయ్యడం. చింపిరి జుట్టుతో ఉంటాడంటే భౌతిక బంధములు లేనివాడు. శివుడన్న నామం అతనికి తగదంటే నామరూపాలకు, అశౌచానికి అతీతుడై సర్వశుభాలకి సాక్షీభూతుడైన అతనికి ఏ నామం సరిపోతుంది.
ఇక దక్షుని శాపంలో వాస్తవమే కాని అపశృతి ఏమీ లేదు. యజ్ఞసమయమందు శివుడు హవిస్సు పొందకుండుగాక అన్నది యజ్ఞ ప్రక్రియనే విశదపరుస్తున్నది. హవిస్సులో శివుడే అంతర్యామి. అన్నానికి తన రుచి తెలియనట్టు, తానే హవిస్సైనప్పుడు శివునికి హవిస్సు దక్కకపోవడమన్నది అర్ధవిహీనం. హవిస్సు ఇతరులు ఆరగించడానికే కాని శివునికి అక్కరలేదు.
పెద్దలు కోపం వచ్చి, నోరు జారినా వారి నోట అశుభవాక్యాలు రావు. అపశబ్దాలు ఉచ్చరించరు. వారి వాక్సుద్ధి అటువంటిది.ఈ విధంగా దక్షుడు శివుని తిట్టిన తిట్లన్నీ అతని పట్ల దీవెనలు, ప్రస్తుతులే అయ్యాయి కాని నిందావాక్యాలు పనికిరావు ...
Anonymous
September 20, 2007 at 8:17 PM